ఎయిరిండియాలో మరో విడత వీఆర్ఎస్
టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా మరోసారి స్వచ్ఛంద విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. గతేడాది జూన్‌లో తొలి విడత వీఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ సిబ్బందికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. మొత్తం 4,200 మంది ఈ పథకానికి అర్హులు కాగా, అందులో 1500 మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. ఇతరులకు వీఆర్‌ఎస్ వర్తింపజేయాలన్న ఉద్యోగుల కోరిక మేరకు రెండో విడత ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిరిండియా చీఫ్ హెచ్ఆర్ సురేశ్ దత్ త్రిపాఠి తెలిపారు. తాజాగా నాన్- ఫ్లయింగ్ స్టాఫ్‌కు ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది.
ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 40 ఏళ్లు దాటిన పర్మినెంట్ జనరల్ కేడర్‌కు చెందిన ఉద్యోగులు, క్లరికల్, నైపుణ్యం లేని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ఈనెల 31వ తేదీ లోపు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే ఎక్స్‌గ్రేషియా మొత్తంపై రూ.1లక్ష అదనంగా చెల్లిస్తామని తెలిపింది. తాజాగా స్వచ్ఛంద విరమణ పథకానికి దాదాపు 2,100 ఉద్యోగులు అర్హులుగా ఉన్నట్లు తెలిసింది.
©️ VIL Media Pvt Ltd. 2023-03-17T17:27:46Z dg43tfdfdgfd