కోపల్లె ఫార్మా కంపెనీకి నోటీసులు
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన కోపల్లె ఫార్మా కంపెనీ యాజమాన్యానికి పొల్యూషన్కంట్రోల్ బోర్డు అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. కంపెనీ ఆవరణలో స్టోర్ చేసిన అత్యంత ప్రమాదకరమైన కెమికల్ డ్రమ్ములు పేలి గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే దాదాపు 500 కుటుంబాలు నరకయాతన అనుభవించాయి.
పొగ, కెమికల్ వాసనతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో తెలిసినవారు, బంధువుల ఇండ్లలో పడుకున్నారు. మేడ్చల్ జిల్లా పీసీబీ రీజనల్ ఆఫీసర్ రాజేందర్ శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం వెదజల్లుతోందని పలుసార్లు కోపల్లె కంపెనీని మూసివేశామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ రన్నింగ్‌లో లేదని, ప్రమాదకర కెమికల్స్ ను ట్యాంకులు, డ్రమ్ముల్లో స్టోర్ చేసినట్లు గుర్తించామన్నారు. కెమికల్ వేస్టేజ్‌ను వెంటనే దుండిగల్ టీఎస్‌డీఎఫ్‌కు తరలించాలని ఆదేశించినట్లు తెలిపారు. కోపల్లె ఫార్మా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మోడీ అపార్ట్‌మెంట్‌వాసులు జీడిమెట్ల సీఐ పవన్ కు ఫిర్యాదు చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2023-03-18T03:13:03Z dg43tfdfdgfd