భారీగా పెరిగిన బంగారం ధర
58,847కి చేరిన 10 గ్రాముల రేటు ఈసీబీ రేట్ల పెరుగుదలతో దూకుడు ఐదు నెలల గరిష్టానికి వెండి ధర
న్యూఢిల్లీ : బంగారం ధరలు మరోసారి పెరిగాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) వరుసగా ఆరవ సమావేశంలో వడ్డీ రేటును పెంచడం వల్ల, శుక్రవారం ఉదయం డీల్స్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. బంగారం ధర 10 గ్రాముల ధర రూ.58,847లకు చేరింది. ఇది లైఫ్‌టైం హై రేటు! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఇంట్రాడే హై రూ.58,277 స్థాయిలను తాకింది. ఇది రికార్డ్ హైల కంటే కేవలం రూ.600 తక్కువ. ఎంసీఎక్స్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర శుక్రవారం 10 గ్రాములకి రూ.58,269లకు పెరిగింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.58,277 స్థాయికి చేరుకున్నప్పటికీ, ప్రాఫిట్ బుకింగ్ మొదలవడంతో పది గ్రాముల ధర రూ.58,174 స్థాయికి పడిపోయింది. ఎంసీఎక్స్‌లో ఈ ఏడాది మే సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కిలోకు రూ.67,140లకు చేరింది. మార్కెట్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.67,417కి చేరుకుంది.
ధరలు ఎందుకు పెరుగుతున్నయ్ ?
బంగారం, వెండి ధరలు పెరగడానికి గల కారణాలపై, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌లో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ - అనూజ్ గుప్తా మాట్లాడుతూ, “ఈసీబీ రేటు పెంపు తర్వాత, యూఎస్ డాలర్ రేటు ఒత్తిడికి గురైంది. డాలర్ ఇండెక్స్ 104 స్థాయికి పడిపోయింది. ఇది బంగారం ధరల పెంపునకు మద్దతును ఇచ్చింది. అందుకే భారీగా కొనుగోళ్లు జరిగాయి" అని ఆయన వివరించారు. క్రెడిట్ స్వీస్ బ్యాంక్ కుప్పకూలినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా బ్యాంకుల్లో పరిస్థితులు కాస్త చల్లబడ్డాయని వాంటేజ్ చీఫ్ స్ట్రాటజీ అండ్ ట్రేడింగ్ ఆఫీసర్ మార్క్ డెస్పల్లియర్స్ అన్నారు.“బ్యాంకులపై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచడానికి, సంక్షోభాలను ఆపడానికి ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నందున మార్కెట్లు పాజిటివ్‌గా మొదలయ్యాయి. స్విస్ నేషనల్ బ్యాంక్, స్విస్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్‌వైజరీ అథారిటీ బుధవారం క్రెడిట్ స్వీస్ బ్యాంకు మూలధన అవసరాలను తీర్చాయి. అవసరమైతే అవి లిక్విడిటీని కూడా అందజేస్తాయని ప్రకటించిన తర్వాత పరిస్థితి చక్కబడింది. ఈసీబీ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బంగారం ధరలు పెరిగాయి”అని ఆయన వివరించారు. క్రెడిట్ స్వీస్ గందరగోళం ఉన్నప్పటికీ, యూరోపియన్ బ్యాంకులు 2008లో వడ్డీ రేట్లను పెంచిన తర్వాత దాని కంటే ఇప్పుడు బలంగా ఉన్నాయని ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ పేర్కొన్నారు.
ఫెడ్ నిర్ణయాలు కీలకం...
బంగారం ధరలు మరింత పెరుగుతాయా ? అన్న ప్రశ్నకు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కు చెందిన అనుజ్ గుప్తా జవాబు ఇస్తూ “యూఎస్ ఫెడ్ నిర్ణయం ఆధారంగా ధరలు మారవచ్చు. వడ్డీ రేట్ల ను పెంచకుంటే డాలర్ మరింత ఒత్తిడికి లోనవుతుంది. ఈక్విటీ, బంగారం, ఇతర బులియన్ మెటల్స్ రేట్లలో తీవ్రమైన మార్పులు ఉండవచ్చు. యూఎస్ ఫెడ్ రేట్లు పెరగకుంటే, గోల్డ్ రేట్లు దాని ప్రస్తుత రేటు1,950 డాలర్ల (ఔన్సుకు) రెసిస్టెన్స్‌ను దాటిపోవచ్చు. తదుపరి అడ్డంకి అయిన 2,000 స్థాయిలకు (ఎంసీఎక్స్‌లో రూ.60,000) చేరుకోవచ్చు” అని ఆయన వివరించారు.
©️ VIL Media Pvt Ltd. 2023-03-18T03:28:03Z dg43tfdfdgfd