‘మా దేశం నుంచి వెళ్లిపోండి’.. భారతీయ విద్యార్థులకు కెనడా హెచ్చరిక.. వారి అడ్మిషన్లు ఫోర్జరీవంటూ ఆరోపణలు

‘నా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది’ అన్నారు డింపుల్.కె. ఆమె 2017 డిసెంబర్ నుంచి స్టూడెంట్ వీసాపై కెనడాలో ఉంటున్నారు.

తమ దేశం వదిలి వెళ్లాలంటూ కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీసీఏ) చెప్పిన 150 మంది భారతీయుల్లో డింపుల్ కూడా ఒకరు.

ఈ 150 మంది ఫోర్జరీ చేసిన కాలేజ్ అడ్మిషన్ లెటర్లతో కెనడా వచ్చి ఉంటున్నారని సీబీసీఏ ఆరోపించింది.

అయితే, తమకేమీ తెలియదని.. తమకు ఈ పత్రాలను ఇమిగ్రేషన్ కన్సల్టేషన్ ఏజెన్సీ ఇచ్చిందని వారు చెప్తున్నారు.

కెనడా వదిలి వెళ్లాలంటూ లేఖలు అందుకున్నవారిలో చాలా మంది ఈ విషయం బయటకు చెప్పడానికి కూడా వెనుకాడుతున్నారు.

భారత్‌లోని చాలా కుటుంబాలు విదేశాలలో ఉండడం గౌరవంగా భావిస్తాయి. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో ఇలాంటిది మరింత ఎక్కువ. డింపుల్ కూడా పంజాబ్‌కు చెందినవారే.

నాలుగేళ్ల కిందట అమెరికాలో 129 మంది భారతీయ విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లోనే అరెస్టయ్యారు. ఒక ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్లు చూపి వారు అమెరికా వెళ్లినట్లుగా ఆరోపణలున్నాయి.

తాజా ఉదంతంపై వివరాల కోసం కెనడాలోని భారత హైకమిషన్, భారత్‌లోని కెనడా హైకమిషన్‌కు బీబీసీ ఈమెయిల్ పంపించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాకు చెందిన డింపుల్‌కు వివాహమైంది. ఆమె తండ్రి టైలర్, తల్లి గృహిణి. ఆమెకు ముగ్గురు తోబుట్టువులున్నారు.

సైన్స్‌లో పీజీ చేసిన డింపుల్ ఇండియాలో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు.

దీంతె పెళ్లయిన తరువాత తన భర్తతో కలిసి మంచి జీవితం గడపాలన్న కోరికతో ఆమె కెనడా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు.

తన కజిన్ ద్వారా ఆమె ఓ ఇమిగ్రేషన్ ఏజెన్సీ విషయం తెలుసుకున్నారు. వారు కెనడాకు పంపించే ఏర్పాట్లు చేస్తారని తెలిసి సంప్రదించారు. వారి నుంచే ఈ వీసా పొందారు.

అయితే, ఈ ఏజెన్సీని గత ఏడు నెలలుగా మూసివేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

‘కెనడాకు చెందిన ఓ కాలేజ్ నా పత్రాలను ఆమోదించినట్లు ఆ ఏజెన్సీ చెప్పింది. ఆ కాలేజ్ నుంచి వచ్చినట్లుగా చెప్తూ అడ్మిషన్ లెటర్ కూడా నాకు ఇచ్చారు’ అని డింపుల్ బీబీసీతో చెప్పారు.

డింపుల్ ఆ ఏజెన్సీకి రూ. 12 లక్షలు చెల్లించారు. కాలేజ్ ఫీ కూడా ఆ మొత్తం నుంచే చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కెనడాలో ఉన్నంత కాలం ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఉన్నట్లుగా చూపించే పత్రాలను కూడా ఆ ఏజెన్సీయే సమకూర్చినట్లు డింపుల్ చెప్పారు.

అయితే, కెనడాకు వెళ్లిన రెండు రోజులలోనే ఏజెన్సీ నుంచి తనకు వేరే సమాచారం వచ్చిందని, అక్కడ కాలేజ్‌లో స్ట్రైక్ జరుగుతున్నందున, మరో కాలేజ్‌కు దరఖాస్తు చేయాలని వారు సూచించారని డింపుల్ చెప్పారు.

డింపుల్ 2019 డిసెంబర్‌లో కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌లో డిప్లమో పూర్తిచేయడంతో ఆమెకు వర్క్ పర్మిట్ వచ్చింది. అయితే, పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్న తరవాత 2022 మే నెలలో కెనడా అధికారులు ఆమె దరఖాస్తులో ఫోర్జరీ పత్రాలు ఉన్నట్లు చెప్పారు.

దీంతో జనవరిలో ఆమెకు దేశం విడిచివెళ్లాలన్న ఆదేశాలు అందాయి. అయిదేళ్ల వరకు తిరిగి కెనడా రాకూడదని ఆ ఆదేశాలలో ఉంది.

దీనిపై కెనడా ఫెడరల్ కోర్టులో ఆమె సవాల్ చేశారు. డింపుల్‌ తరఫున వాదిస్తున్న న్యాయవాది జశ్వంత్ సింగ్ మంగత్ ఆమెలాగే ఎక్స్లూజన్ ఆర్డర్ అందుకుని కెనడా వదిలి వెళ్లాల్సిన పరిస్థితులలో ఉన్న సుమారు మరో 35 మంది తరఫునా వాదిస్తున్నారు.

వీరిలో చాలామంది నుంచి ఏజెన్సీలు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని నకిలీ అడ్మిషన్ లెటర్స్ ఇచ్చాయని జశ్వంత్ చెప్పారు. ఈ నకిలీ అడ్మిషన్ లెటర్స్‌తోనే వీసాలు పొందారని ఆయన చెప్పారు.

అమెరికా: ఒడిలో మూడేళ్ల బాబు, భార్యతో మెక్సికో సరిహద్దులో 30 అడుగుల గోడ దూకిన భారతీయుడు.. అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నంలో మృతి

అక్కడ కోర్సులు పూర్తి చేసిన తరువాత వీరిలో చాలామంది వర్క్ పర్మిట్లు పొంది పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్నారని జశ్వంత్ చెప్పారు. ఆ సమయంలో వీరి పత్రాలలో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు.

అయితే.. తమవి నకితీ పత్రాలని ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు ఎందుకు చెప్పలేదు? వీసాల కోసం పరిశీలించినప్పుడు ఎందుకు గుర్తించలేదు? అని డింపుల్ ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంపై సీబీఎస్ఏను బీబీసీ సంప్రదించినప్పడు.. ఏ ఒక్క కేసు గురించో తాము మాట్లాడలేమని చెప్పింది. అయితే, ‘పర్మినెంట్ రెసిడెన్సీ లక్ష్యంగా విదేశీ విద్యార్థులకు వర్క్ పర్మిట్‌కు అవకాశం కలిగించేలా ప్రైవేట్ కాలేజ్‌లు సబ్సిడీ లేని ప్రోగ్రామ్‌లు రూపొందించినట్లు గుర్తించారు. ఫలితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్‌లు జారీ చేసేందుకు నిబంధనలు కఠినతరం చేసేలా ప్రభుత్వం 2022 జులై 7న నిర్ణయం తీసుకుంది’ అని చెప్పింది.

ఈ నిర్ణయం అనేక మంది కలలను భగ్నం చేసింది.

కాగా తమకు పత్రాలు ఇచ్చిన భారత్‌లోని ఇమిగ్రేషన్ ఏజెన్సీకి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలేమీ లేనందున చట్టపరమైన చర్యలు తీసుకోలేమని పంజాబ్‌కు చెందిన చమన్‌దీప్ సింగ్ అనే విద్యార్థి చెప్పారు.

నకిలీ పత్రాలు తానేమీ తయారుచేయలేదు కాబట్టి తాను తిరిగి భారత్‌కు వెళ్లబోనని మరో భారతీయ విద్యార్థి ఇంద్రజిత్ సింగ్ చెప్పారు.

విద్యార్థులను మోసగించిన ఇమిగ్రేషన్ ఏజెన్సీలపై భారత అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-03-18T12:46:39Z dg43tfdfdgfd