అంబానీ, అదానీ, టాటా వంటి పెద్ద సంస్థలతో నష్టం కూడా ఉందా?

మార్కెట్‌లో పోటీని పెంచాలంటే భారత్‌లోని పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను విభజించాలని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తాజా రీసెర్చ్ పేపర్‌లో సూచించారు.

అధిక రేట్లు పెట్టకుండా ఉండేలా సంస్థలపై నియంత్రణ అవసరమని కూడా చెప్పారు.

అమెరికాకు చెందిన బ్రూకింగ్ ఇన్‌స్టిట్యూట్ తరఫున ఆయన ఈ పేపర్ సిద్ధంచేశారు.

ఎన్‌వైయూ స్టెర్న్‌లోని ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆచార్య ఆ పేపర్‌లో ‘‘ఇండస్ట్రియల్ కాన్సెంట్రేషన్’’ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే దేశంలోని మొత్తం ఉత్పత్తిలో చిన్న కంపెనీల వాటా 1991 తర్వాత తగ్గింది.

ఆర్థిక సరళీకరణ పేరుతో అప్పట్లో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వ సంస్థలు కూడా తమ నియంత్రణలను సడలించుకుంటూ ప్రైవేటు సంస్థలకు మార్గం సుగమం చేశాయి. కానీ, 2015 తర్వాత ఇండస్ట్రియల్ కాన్సెంట్రేషన్ మళ్లీ పెరిగింది.

భారత్‌లోని ఐదు దిగ్గజ వ్యాపార సంస్థలు – రిలయన్స్, అదానీ, టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌ల వాటా మొత్తం నాన్-ఫైనాన్షియల్ సెక్టార్లలో 1991లో పది శాతంగా ఉండేది. 2021నాటికి ఇది 18 శాతానికి పెరిగింది.

‘‘ఈ దిగ్గజ సంస్థలు చిన్న సంస్థలతోపాటు పెద్దపెద్ద సంస్థలను కూడా తోసిరాజని మార్కెట్‌పై పట్టు సాధించాయి’’అని ఆచార్య వివరించారు. ‘‘ఇక్కడ ఆ ఐదు సంస్థల తర్వాత ఉండే ఐదు సంస్థల మొత్తం వాటా ఇదే సమయంలో 18 నుంచి 9 శాతానికి పడిపోయింది’’అని ఆయన చెప్పారు.

దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చని ఆచార్య అన్నారు. ‘‘ఇబ్బందులో ఉండే పెద్ద కంపెనీలను తమలో కలిపేసుకోవడం, ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, భారత్‌లో విధానాలు, భారీ ధరల విషయంలో నియంత్రణా సంస్థలు చూసీచూడట్లు వ్యవహరించడం’’ఇలా ఇక్కడ చాలా కారణాలు ఉంటాయని ఆయన చెప్పారు.

దీని వల్ల మనం ఆందోళన చెందాల్సిన అవసరముందని ఆచార్య వివరించారు. ‘‘క్రోనీ క్యాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు), ప్రాజెక్టులకు నిధులు సరిగా కేటాయించకపోవడం, తమ సంస్థల మధ్య పారదర్శకత లేని లావాదేవీలు, మరింత విస్తరణకు రుణాలు తీసుకోవడం, కొత్త వారు మార్కెట్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవడం’’లాంటి ముప్పులను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.

తమ స్థాయికి మించి రుణాలు తీసుకోవడం గురించి అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికలోనూ పేర్కొన్నారు. ఆ నివేదిక విడుదలయిన తర్వాత అదానీ గ్రూపుకు చెందిన బిలియన్ డాలర్ల సంపద స్టాక్ మార్కెట్‌లో ఆవిరైంది.

చాలా దేశాల్లో పెద్ద సంస్థలతో చాలా సమస్యలు వచ్చాయి.

‘‘దేశంలో చాంపియన్‌గా మారిన సంస్థలు ఒక్కోసారి విపరీతంగా రుణాలు తీసుకోవడం, కుప్పకూలడం లాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది. కొన్ని ఆసియా దేశాల్లో ఇలానే జరిగింది. ఉదాహరణకు 1998లో ఇండోనేసియాను చెప్పుకోవచ్చు’’అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో ఇండియా హెడ్‌గా పనిచేసిన జోస్ ఫెల్మాన్ చెప్పారు.

గత ఫిబ్రవరిలో నేషనల్ చాంపియన్స్ పేరుతో పెద్దపెద్ద ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించే భారత్ మోడల్‌పై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్థికవేత్త నోరియెల్ రూబిని ఒక కథనం రాశారు.

‘‘ఈ దిగ్గజ సంస్థలు విధాన నిర్ణయాలను తమ అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాయి. ఫలితంగా కొత్త ఆవిష్కరణలపై ప్రభావం పడుతోంది. కీలకమైన రంగాల్లో అంకుర సంస్థలు అడుగుపెట్టేందుకు ఈ దిగ్గజాలు అడ్డుగా నిలుస్తున్నాయి’’అని రూబిని వ్యాఖ్యానించారు.

‘‘నేషనల్ చాంపియన్స్’’ పేరుతో ప్రైవేటు సంస్థల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానం 1990ల్లో చైనా, ఇండోనేసియా, దక్షిణ కొరియాలలో అనుసరించినదే. అక్కడ కొన్ని కుటుంబాలు దిగ్గజ సంస్థలను నడిపించేవి. శాంసంగ్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి ఇది ఎదిగింది.

‘‘అయితే, మార్కెట్‌లో పోటీ వాతావరణం నుంచి కాపాడేందుకు ఈ దిగ్గజ సంస్థలను ఆయా దేశాలు వెనకేసుకు రావు. కానీ, భారత్‌లో అలా కాదు’’అని ఆచార్య వ్యాఖ్యానించారు.

‘‘భారత్‌లో మాత్రం ప్రొటెక్షనిజం పేరుతో దేశీయ సంస్థలను విదేశీ సంస్థల పోటీ నుంచి కాపాడటం ఎక్కువవుతోంది’’అని రూబినీ కూడా రాసుకొచ్చారు.

అయితే, ఇలాంటి చర్యలు భారత్ ‘‘ప్రపంచ ఫ్యాక్టరీ’’గా మారాలనే కలలపై ప్రభావం చూపించొచ్చు.

ఏం చేయాలి?

అటు ఆచార్య, ఇటు రూబినీ ఇద్దరూ.. భారత్ సుంకాలను తగ్గించాలని, మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచాలని పిలుపునిస్తున్నారు. ‘‘చైనా ప్లస్ వన్’’ వ్యూహాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా సప్లై చైన్లను చైనా నుంచి భారత్, వియత్నాం లాంటి దేశాలకు తరలించేందుకు దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే, భారత్‌లో ఇండస్ట్రియల్ కాన్సెంట్రేషన్‌తో దేశీయంగా చాలా సమస్యలు వచ్చిపడే ముప్పుందని ఆచార్య అంటున్నారు. మన దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా గరిష్ఠ స్థాయిలో కొనసాగడానికి, ధరల పెరుగుదలకు ఈ బిగ్ ఫైవ్ కారణమని ఆయన చెప్పారు.

‘‘ఈ విషయంలో మరింత లోతైన, సమగ్ర అధ్యయనం అవసరం. అయితే, మార్కెట్‌లో వీటి పరిధి, ధరల పెరుగుదలకు మధ్య సంబంధముందని మా దర్యాప్తులో తేలింది’’అని ఆయన చెప్పారు.

అయితే, ఈ రెండింటి మధ్య సంబంధం విషయంలో కొందరు ఆర్థిక వేత్తలు బీబీసీ ఎదుట సందేహాలు వ్యక్తంచేశారు.

‘‘ఒకవేళ బిగ్ ఫైవ్ సంస్థ ఒకటి కొత్త రంగంలోకి అడుగుపెడితే, అది మరింత పెద్దది అవుతుంది. ఫలితంగా ఆ రంగంలో పోటీతత్వం పెరుగుతుంది. ఆ తర్వాత ధరలు పడే అవకాశముంది. జియో వచ్చినప్పుడు అదే కదా జరిగింది’’అని ఫెల్మాన్ అన్నారు.

మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాలో చీఫ్ ఎకనమిస్టు పనిచేస్తున్న మదన్ సబ్నవిస్‌ కూడా ఫెల్మాన్ వాదనతో ఏకీభవించలేదు.

‘‘చిన్నచిన్న సంస్థలు ఆధిపత్యం ప్రదర్శస్తున్న విమానయానం లాంటి రంగాలను చూడండి. అక్కడ ధరలు ఎప్పుడూ గరిష్ఠంగానే ఉంటున్నాయి. అక్కడ పెద్దపెద్ద సంస్థలు లేవు కదా? ’’అని ఆయన ప్రశ్నించారు.

విద్య, ఆరోగ్యం, నిత్యవసరాలు లాంటి కోర్ రంగాల్లో ఈ బిగ్ ఫైవ్‌కు ప్రాతినిధ్యం లేదని ఆయన గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-03-31T14:45:16Z dg43tfdfdgfd