Apple Mumbai Store | ఐ-ఫోన్ మేకర్ ఆపిల్ భారత్‌లో తన మార్కెట్‌ను విస్తరించ తలపెట్టింది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియా పట్ల ఆపిల్ దృక్పథం మారినట్లు కనిపిస్తున్నది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో తన ఫ్లాగ్‌షిప్ ఇండియా రిటైల్ స్టోర్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నది. ముంబై తర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త ఆపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయనున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనే త్వరలో భారత్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభం కానున్నదని సంస్థ సీఈవో టిమ్‌కుక్ ధృవీకరించిన సంగతి తెలిసిందే.
ముంబైలో ఆపిల్ రిటైల్ స్టోర్.. జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు ఒక ఆంగ్లదిన పత్రిక కథనాన్ని బట్టి తెలుస్తున్నది. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, బీజింగ్, సింగపూర్, మిలాన్ వంటి నగరాల తర్వాత ముంబైలోనే ఆపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుండటం గమనార్హం.
న్యూఢిల్లీలో ఇండియా ఆపిల్ రిటైల్ స్టోర్.. సాకెట్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏర్పాటు కానున్నది. ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభించే ఆపిల్ స్టోర్ మాదిరిగానే ఢిల్లీ రిటైల్ స్టోర్ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ముంబైలో ఆపిల్ రిటైల్‌స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే ఢిల్లీ రిటైల్ స్టోర్‌ను తెరుస్తారని సమాచారం. ఏప్రిల్-జూన్ మధ్య ఢిల్లీ స్టోర్ తెరుస్తారని ఆపిల్ వర్గాలు తెలిపాయి.
ఆపిల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌ల సమయం లభ్యత ఆధారంగా ముంబై ఆపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభించడానికి తేదీ, ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రిటైల్ అండ్ పీపుల్ డైర్‌డ్రే ఓబ్రెయిన్ చేతుల మీదుగా ఆపిల్ ముంబై రిటైల్ స్టోర్ తెరుస్తారని సమాచారం. సంస్థ సీఈవో టిమ్ కుక్.. భారత్‌కు వస్తారా? లేదా? అన్న విషయమై సమాచారం లేదని ఆపిల్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటి వరకు చైనా కేంద్రంగా ఐ-ఫోన్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న ఆపిల్, కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత ఆల్టర్నేటివ్‌గా భారత్‌లో ఉత్పాదక యూనిట్లు స్థాపనకు చర్యలు తీసుకుంటున్నది. భారత్ కేంద్రంగా అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు ఆపిల్ సిద్ధమైంది. అందుకోసం భారత్‌ను ఒక రీజియన్‌గా గుర్తిస్తున్నట్లు ఆపిల్ సంకేతాలిచ్చింది.
2023-03-17T15:49:17Z dg43tfdfdgfd