GOLD RATES | బంగారం ధరల్లో ఆల్‌టైం రికార్డు.. వచ్చేవారం రూ.60 వేల మార్క్‌?!

Gold Rates | సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్వీబీ).. దానివెంటే సిగ్నేచర్‌ బ్యాంక్‌ దివాళా.. అదే బాటలో స్విస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ పయనం.. అమెరికా, ఈయూ బ్యాంకుల్లో సంక్షోభం.. అనిశ్చితిలో అమెరికా డాలర్‌.. ఈయూ యూరో చిక్కుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్‌కు ఆల్టర్నేటివ్‌ పెట్టుబడి మార్గంగా బంగారం కనిపిస్తున్నది. అందుకే శుక్రవారం సాయంత్రం మల్టీ కమొడిటీ ఎక్సేంజ్‌ (ఎంసీఎక్స్‌) ఫ్యూచర్స్‌లో బంగారం తులం ధర ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. 10 గ్రాముల బంగారం (24 క్యారట్లు) ఏప్రిల్‌ ప్యూచర్స్‌ ధర ఇంట్రాడేలో రూ.59,461 పలికి ముగింపులో రూ.59,420 వద్ద స్థిర పడింది. గురువారం ముగింపు ధరతో పోలిస్తే రూ.1414 (2.44%) ఎక్కువ పలికింది. మరోవైపు వెండి మే ఫ్యూచర్స్‌ ధర సైతం మూడు శాతానికి పైగా వృద్ధి చెంది కిలోపై రూ.2118 పెరుగుదలతో రూ.68,649 వద్ద స్థిర పడింది. అమెరికా, ఈయూ బ్యాంకుల్లో సంక్షోభం ఇప్పటికిప్పుడు ముగిసేలా కనిపించడం లేదు కనుక బులియన్‌ మార్కెట్‌లో బుల్‌ పరుగులు తీయనున్నది. వచ్చేవారం ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.60 వేల మార్క్‌ను దాటేలా ఉందని కమొడిటీ అండ్‌ కరెన్సీ నిపుణుడు అనూజ్‌గుప్తా పేర్కొన్నారు.

శనివారం దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల పరిధిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.58 వేల పై చిలుకు పలుకుతున్నది. బెంగళూరులో రూ.58,740, ఢిల్లీలో రూ.58,840, కోల్‌కతా, ముంబై, పుణె, హైదరాబాద్‌ నగరాల పరిధిలో రూ.58,690 పలికింది. అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, బెంగళూరుల్లో రూ.58,740లకు చేరుకున్నది. కోయంబత్తూరులో రూ.59,450కి చేరుకుంది.

వచ్చేవారం యూఎస్‌ ఫెరడల్‌ రిజర్వ్‌.. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం కానున్నది. ప్రపంచ దేశాల్లోని బ్యాంకుల్లో సంక్షోభం వల్ల బంగారం, వెండికి గిరాకీ పెరిగింది. బంగారం, వెండి ధరల ధరల్లోనూ ఒడిదొడుకులు నమోదు కావచ్చునని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ సీనియర్‌ కమోడిటీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నృపేంద్ర యాదవ్‌ చెప్పారు. ఇప్పటికే ఎంసీఎక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధర రూ.59 వేల మార్క్‌ను దాటేసింది. వెండి కిలో ధర మాత్రం రూ.60 వేల వద్దే తచ్చాడుతున్నది.

అమెరికా, ఈయూ బ్యాంకుల్లో సంక్షోభంతో బంగారం ధర శుక్రవారం రెండు శాతానికి పైగా పెరిగింది. గత మూడేండ్లలో ఒక వారంలో బంగారం ధర పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌ తర్వాత స్పాట్‌ గోల్డ్‌ ధర పెరగడం ఇదే ప్రథమం కూడా. శుక్రవారం మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స ధర 2.8 శాతం పెరిగి 1971.95 డాలర్లు పలికింది. ఈ వారంలో బులియన్‌ మార్కెట్‌లో దాదాపు 5.6 శాతం ధర పెరిగింది. 2020 మార్చి తర్వాత బంగారం ధర పెరగడం కూడా ఇదే గరిష్టం. యూఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ ధర 2.6 శాతం పెరిగి 1973.50 డాలర్ల వద్ద సెటిలైంది. వచ్చేవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2000 డాలర్లు దాటొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్‌ వెండి ధర 24-24 డాలర్ల మధ్య తచ్చాడుతుందని భావిస్తున్నారు.

2023-03-18T12:04:37Z dg43tfdfdgfd