H-1B Visa | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు.. ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు చర్యలు చేపట్టిన కార్పొరేట్ సంస్థలు.. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు మొదలు మామూలు కంపెనీల వరకు ప్రతి సంస్థ ఉద్యోగులను వదిలించుకుంటున్నది. అమెరికాలోని కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో విదేశీయులు ఉంటే.. వారిలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్‌లోపు మరో సంస్థలో ఉద్యోగిగా చేరినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా, మరో సంస్థలో చేరకపోతే మాత్రం సొంత దేశానికి తిరిగి వెళ్లాల్సిందే.. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన ఓ సలహా సంఘంహెచ్-1 బీ వీసాదారులకు కాసింత రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం 60 రోజులున్న గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పొడిగించాలని సలహా సంఘం సిఫారసు చేసింది. ఆసియా అమెరికన్-నేటివ్ హవాయిన్-పసిఫిక్ సామాజిక వర్గాల ప్రయోజనాలు, సమస్యలపై సలహా ఇచ్చేందుకు అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సలహా సంఘం ఈ సిఫారసులు చేసింది. అంతే కాదు ఈ సిఫారసులను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యూఎస్‌సీఐఎస్)కు పంపారు.
ఈ సలహా సంఘం సిఫారసులు అమల్లోకి వస్తే ఇండియన్స్‌తోపాటు అమెరికాలో పని చేస్తున్న వేల మంది విదేశీయులకు ఖచ్చితంగా రిలీఫ్ కల్పించినట్లే అవుతుంది. ఇటీవలే గూగుల్, మైక్రోసాఫ్ట్. మెటా, అమెజాన్ వంటి సంస్థలు వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాయి. దీంతో ఆయా ఉద్యోగులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.ప్రస్తుతం గల గ్రేస్ పీరియడ్ 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టతరంగా ఉంది. దరఖాస్తులు నింపే ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉండటంతో గడువు సరిపోవడం లేదు. బైడెన్ అధ్యక్ష సలహా సంఘం సిఫారసు అమల్లోకి వస్తే, అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు 180 రోజుల సమయం లభిస్తుంది. ఈ గడువు లోపు కొత్త ఉద్యోగం సంపాదించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
అధ్యక్ష సలహా సంఘం సిఫారసులను యూఎస్‌సీఐఎస్ దాదాపు అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అజయ్ భుటోరియా తెలిపారు. ఇతర బ్యూరోక్రటిక్ అవరోధాల మధ్య ఉద్యోగాలు కోల్పోయిన టెక్నాలజీ నిపుణులు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్ట సాధ్యం అని భుటోరియా చెప్పారు. ‘కొలువు కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగుల గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ పౌరసత్వ, వసల సేవల సంస్థకు బైడెన్ అధ్యక్ష సలహా సంఘం సిఫారసు చేసింది’ అని సలహా సంఘ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా చెప్పారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ దాటితే సంబంధిత టెక్నాలజీ నిపుణుడు వీడితే.. నైపుణ్యం గల నిపుణుడ్ని కోల్పోవడం అమెరికాకు నష్టం అని భుటోరియా తెలిపారు.
ప్రతిపాదిత గడువు పొడిగింపు అమల్లోకి వస్తే, అత్యంత నిపుణులైన విదేశీ టెక్కీలు.. కొత్తగా ఉద్యోగం సంపాదించేందుకు మరింత సమయం పొందినట్లవుతుంది. అత్యంత నిపుణులైన విదేశీ వర్కర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు చాలా విలువైన వారని భుటోరియా వెల్లడించారు. గ్రీన్ కార్డుల జారీ అంశం కూడా ఈ సలహా సంఘం భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. గ్రీన్ కార్డుల దరఖాస్తుల ప్రారంభ దశలో ఉద్యోగుల ధృవీకరణ పత్రం ప్రతిపాదనపైనా చర్చ జరిగిందని సమాచారం.
2023-03-17T12:04:05Z dg43tfdfdgfd