KANE WILLIAMSON: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం

Kane Williamson Ruled Out From IPL: ఐపీఎల్ అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన పోరు అభిమానులకు ఫుల్‌ కిక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి విజయంతో సీజన్‌ను ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు ఎదుదు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు విలియమ్సన్ మోకాలి గాయానికి గురయ్యాడు. గాయం తర్వాత విలియమ్సన్ మైదానం వీడాడు.  

చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద గాల్లో ఎగురుతూ అద్భుతంగా అందుకున్నాడు విలియమ్సన్. అయితే అప్పటికే గాల్లో బౌండరీ లైన్ దాటేయడంతో బంతిని వెంటనే గ్రౌండ్‌లోకి విసిరేశాడు. కానీ దురదృష్టవశాత్తూ ల్యాండ్ సమయంలో ఒక్కసారిగా కిందపడడంతో మోకాలికి గాయమైంది. చాలాసేపు నొప్పితో విలవిలలాడాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. డేవిడ్ మిల్లర్ గైర్హాజరీలో మిడిల్ ఆర్డర్‌లో విలిమ్సన్‌ను వినియోగించుకోవాలని గుజరాత్ భావించింది. అయితే ఇలా గాయంతో అర్ధాంతరంగా విలియమ్సన్ సీజన్‌కు మొత్తానికి దూరమవ్వడం అభిమానులను నిరాశ పరుస్తోంది.

విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ యంగ్‌ ప్లేయర్ కొన్ని చూడచక్కని షాట్లతో అలరించాడు. 17 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు బాదాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

గత సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే జట్టు ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేదు. విలియమ్సన్ కూడా బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గతేడాది వేలానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. అయితే వేలంలో కేవలం రూ.2 కోట్ల బేస్ ధరతో ఈ స్టార్‌ ప్లేయర్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. గత సీజన్‌లో హైదరాబాద్ రూ.16 కోట్లు ఇచ్చి కేన్ విలియమ్సన్‌ను తన వద్దే ఉంచుకోగా.. ఈసారి మొత్తం రూ.14 కోట్ల నష్టాన్ని చవిచూశాడు విలియమ్సన్.  

 

విలియమ్సన్ ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 77 మ్యాచ్‌లు ఆడాడు. 36.22 సగటు, 126.03 స్ట్రైక్ రేట్‌తో 2101 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 89 పరుగులు. న్యూజిలాండ్ తరుఫున 94 టెస్టులు, 161 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 8124 పరుగులు, వన్డేల్లో 6555 రన్స్, టీ20ల్లో 2464 పరుగులు చేశాడు. విలియమ్సన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 41 సెంచరీలు చేశాడు. 

Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్‌ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!  

Also Read: PBKS Vs KKR: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్.. పంజాబ్ Vs కోల్‌కత్తా హెడ్ టు హెడ్ రికార్డులు.. పిచ్ రిపోర్ట్ ఇదే..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2023-04-01T10:40:57Z dg43tfdfdgfd