T WORKS | ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం.. టీ వర్క్స్‌లో పీసీబీ ఫ్యాబ్రికేషన్‌ సదుపాయం

T Works | హైద‌రాబాద్ : ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు టీ వర్క్స్‌( T Works ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్వాల్‌కామ్‌ ఇండియా కంపెనీ( Qualcomm India Company ) మద్దతుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బహుళ లేయర్‌ పీసీబీ ఫ్యాబ్రికేషన్‌( PCB Fabrication ) సదుపాయాన్ని టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌ కంపెనీల సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా క్వాల్‌కామ్‌ కంపెనీ దేశంలోనే అతి పెద్ద ప్రోటోటైపింగ్‌( Proto Typing ) కేంద్రంగా ఉన్న టీ వర్క్స్‌లో మల్టీ లేయర్‌ ప్రింటెడ్ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీ) సదుపాయాన్ని కల్పించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నామని టీ వర్క్స్‌ సీఈఓ సుజయ్‌ కారంపూరి తెలిపారు.

ఈ సదుపాయంతో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల నమూనా, అభివృద్ధిని వేగవంతం చేయడానికి 12-పొరలు కలిగిన పీసీబీ వేగవంతంగా ఆవిష్కరణలు చేసుకునేలా చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా డిజైన్‌, ఇన్నోవేషన్‌ కార్యక్రమాల కోసం క్వాల్‌కామ్‌ కంపెనీ ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్‌ తయారీకి గమ్యస్థానంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాలను రూపొందిస్తూ అమలు చేస్తోంది. ప్రస్తుతం టీ వర్క్స్‌లో ఏర్పాటు చేసిన పీసీబీతో అత్యాధునిక టెక్నాలజీ ఉత్పత్తులను స్టార్టప్‌లు ఆవిష్కరించేందుకు అవకాశం కలుగుతుంది. దీని ద్వారా దేశం నుంచి గ్లోబల్‌ బ్రాండ్‌లను రూపొందించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. కార్పొరేట్‌ సంస్థలతో కలిసి భాగస్వామ్యం కావడం ద్వారా రకరకాల ప్రయోజనాలను టెక్నాలజీ నిపుణులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం అని తెలిపారు.

క్వాల్‌ కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇంజినీరింగ్‌ విభాగం వీపీ శశి రెడ్డి మాట్లాడుతూ.. ఈ మార్గదర్శక ప్రాజెక్ట్‌ కోసం టీ వ‌ర్క్స్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ సాంకేతిక సంస్థగా, ఆవిష్క‌రణలను నడపడానికి ఇటువంటి సౌకర్యాల అవసరాన్ని గుర్తించామని, ప్రతి ఒక్క‌రికీ ఒకే విధంగా వనరులు అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సాధనాలతో పాటు ప్రతిభను పెంపొందించేందుకు ప్రజలకు టీ వ‌ర్క్స్ రూపంలో భారీ ముందడుగు వేసిందన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉత్పత్తి ఆవిష్క‌రణలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చడానికి టీ వర్క్స్‌ కేంద్రంగా మారుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు, వైద్య పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్‌ ఉత్పత్తులు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ మొదలైన వాటితో సహా అనేక రకాల ఉత్పత్తుల అభివృద్ధికి మద్దతు ఈ పీసీబీ కేంద్రం కీలకంగా మారుతుందన్నారు. టీ వర్క్స్‌ ద్వారా ఇన్నోవేటర్‌లు తమ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను డిజైన్‌ చేయడం, రూపొందించడం, అసెంబుల్‌ చేయడం, పరీక్షించడం చేస్తారు. ఇది ఉత్పత్తి ఆవిష్క‌రణ కోసం ఖర్చు, సమయం, సంక్లిష్టతను బాగా తగ్గిస్తుందని శశిరెడ్డి తెలిపారు.

2023-03-31T14:57:08Z dg43tfdfdgfd